ఓ మాతంగి..ఓ బసివి..

ఓ మాతంగి..ఓ బసివి..
_______________
ఆధిపత్య కులరాబందులు
వేటాడే సరదాకై
గుడిసెల్ని చెరపట్టి
ఆడతనాన్నీ, అమ్మతనాన్నీ
నడివీధిన నడిపించి కామ కళ్ళకావరం తో
వికటంగా నవ్వినపుడేంచేసామని సమర్ధించుకొందాం?
గోవునేమో మాతను చేసి, మనసారా పూజించి,
గుడిసెలోని పసి బిడ్డకు మాతంగని ముద్రవేసి
దేవుడిపేర దోచుకుంటే సైతం
తప్పురా అని ముక్కోటిదేవతల్లో ఒక్కడైనా
ముందుకొచ్చి ప్రశ్నించని
అత్యాచారాల వేదభూమిలో ఆడబిడ్డకేం విలువుందని..
పారిస్ కై ప్రార్దిద్దాం.?
సందుకో దేవాలయం
గొందుకో దేవుడూ కొలువైన దేశంలో
వెలివేతల్ని ప్రశ్నించని మూగదేవుళ్ళ రాజ్యంలో..
ఖైర్లాంజీ హత్యాచారాలు ప్రతినిత్యం చెలరేగుతున్నా
స్థంభం చీల్చుకురాడేంటో యే నరసిమ్హావతారుడూ ?
కులకాంతలకే చీరలిచ్చే నికృష్టులే దేవుళ్ళైన హెచ్చుతగ్గుల భారతంలో
అట్టడుగువర్గపు మగువ మాంసం విచ్చలవిడిగా
రెడ్లైట్ ఏరియాల పాలౌతుంటే
మనం మాత్రం పారిస్ కై ప్రార్ధిద్దాం..
సామాన్యులు పూటకో తీరున రాళ్ళదెబ్బలకు కు బలౌతుంటే
ఫుట్పాత్ లు రక్తమోడి,
గొప్పోళ్ళకు తర్పణమౌతున్న నిచ్చెనమెట్ల సమాజంలో,
మూల్నివాసుల్ని అనాధలు చేసే కుట్రల్లో
బ్రాహ్మణవాదం తలమునకలౌతూ
కుట్రలు రచిస్తున్న అత్యవసర సమయాల్లో..
మనం మాత్రం..
పారిస్ కై ప్రార్దిద్దాం.
పరువుహత్యల పందేరంలో..
అణచివేత బహురూపపు విన్యాసాల్లో
పసికందులు, నవయువతులు
అగ్నికీలల్లో వేటకొడవళ్ళతో
పిడికెడు బూడిదగా
కత్తికో కండగా
నైవేద్యాలౌతుంటే.
భిన్నత్వంలో యేకత్వం పేరుతో
పరాయి దేశాల ప్రెసిండెంట్లని నమ్మిద్దాం.
ఇంట్లో ఈగలమోతని కాశ్మీర్ శాలువాతో
అందంగా కప్పేసి
బడుగుల బ్రతుకుల్ని
అధికారపు గొడుగులుగా వాడుకుని
మతమౌఢ్యపు మంత్రాంగం
పరిపాలన గాలికొదిలి
అభివృద్ధికి నీళ్ళొదిలి
మతతత్వపు వీణలు సవరిస్తూ తిరుగుతుంటే..
మనమంతా నిష్టగా కళ్ళుమూసి..
పారిస్ కై ప్రార్ధిద్దాం..!
వైరుధ్యపు వ్యవస్థకు ఊపిర్లూదేపనిలో
సనాతన హిందూ ధర్మానికి మళ్ళీ ప్రాణంపోద్దాం,
కులహంకార క్రూరమృగం దేశాన్ని కబళించాక
తీరిగ్గా కొవ్వొత్తులు వెలిగిద్దాం,
వివక్షల దుర్గంధాన్ని ధవళవస్త్రాల చాటున బహుతెలివిగా దాచిపెట్టి
ప్రశాంతంగా మనమంతా ర్యాలీలు నిర్వహిద్దాం.
నిజాయితీ పాళ్ళేలేని మొక్కుబడి ప్రార్ధనలేగా..
కపటపు పెదవులతో..
రెండేరెండు క్షణాల్లో గడగడా వల్లించేద్దాం .(During terrorist attack on Paris)
అరుణ గోగులమండ.

Comments

Popular posts from this blog

NARENDRA JADHAV’S OUTCASTE: A MEMOIR- A STORY OF THE METAMORPHOSIS OF DALITS

Poisoned bread: protest in Dalit short stories.

FIGURES OF SPEECH